అల్వాల్ పోలీసుల చాకచక్యం 24 రోజుల్లోనే ఇంటి చోరీ కేసు ఛేదన,ముగ్గురు నిందితుల అరెస్ట్ 20 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం..
మేడ్చల్ మల్కాజ్‌గిరి, జిల్లా జూలై 3 మన వార్త :అల్వాల్ పోలీసుల చాకచక్యంతో భారీ ఇంటి చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని కుటుంబం స్వగ్రామానికి వెళ్లిన సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాచ్‌మన్ చోరీకి పాల్పడగా, దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసిన మరో ఇద్దరితో కలిసి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 13.4 తులాల బంగారు ఆభరణాలు,330 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు 20.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఇంటికి తిరిగి రాగానే షాక్..
అల్వాల్‌కు చెందిన మేడిశెట్టి శ్యామ్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి జూన్ 3న స్వగ్రామానికి వెళ్లారు. దాదాపు మూడు వారాల అనంతరం జూన్ 27న ఇంటికి చేరుకోగా ప్రధాన ద్వారం తాళం, బెడ్‌రూమ్ బీరువా పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోనే ఉన్న తాళాలతో గోద్రేజ్ లాకర్ తెరిచి, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును అపహరించినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు క్రైమ్ నం. 631/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాచ్‌మనే దొంగగా తేలిన విచారణ సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు జూలై 3న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో...
కొల్లి లోవరాజు (38) వాచ్‌మన్, చంద్రపురం కాలనీ, అల్వాల్
పాపాని రాజు (45) డెలివరీ బాయ్, జానకి నగర్
మైలారం మహేష్ చారి (46) స్వర్ణకారుడు, సత్యమ్మ నగర్
పక్కా ప్లాన్‌తో చోరీ
ప్రధాన నిందితుడు కొల్లి లోవరాజు బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. బాధిత కుటుంబం స్వగ్రామానికి వెళ్లిన విషయం, ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువా పగులగొట్టి ఇంట్లోనే ఉన్న తాళాలతో లాకర్ తెరిచి విలువైన ఆభరణాలు, నగదును అపహరించాడు. అనంతరం దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను పాపాని రాజు, స్వర్ణకారుడు మహేష్ చారికి విక్రయించినట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న ఆస్తి
నిందితుల వద్ద నుంచి
4 తులాల నల్లపూసల బంగారు గొలుసు
2 తులాల పుస్తెల తాడు
4 తులాల బంగారు పెండెంట్లు, చెవిపోగులు, ఉంగరాలు 12.5 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు 22 గ్రాముల బంగారు బిస్కెట్
20 గ్రాముల వెండి మొలతాడు 248 గ్రాముల వెండి బిస్కెట్ 59 గ్రాముల వెండి పూజా సామగ్రి
స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 13.4 తులాల బంగారం,330 గ్రాముల వెండి వస్తువులు రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రజలకు అల్వాల్ పోలీసుల సూచనలు ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన ఆభరణాలు, పత్రాలను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, ఇంటి పనివారు, వాచ్‌మన్‌ల వివరాలను పోలీసుల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
Medchal -Malkajgiri District
అల్వాల్ పోలీసుల చాకచక్యం 24 రోజుల్లోనే ఇంటి చోరీ కేసు ఛేదన,ముగ్గురు నిందితుల అరెస్ట్ 20 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని
