జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు,
29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం,
ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 3 మన వార్త :అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకీనగర్‌లో గత శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చాకచక్యంగా దర్యాప్తు చేపట్టిన అల్వాల్ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, వారిలో ఒకరిని అదుపులోకి తీసుకొని చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అల్వాల్ ఏసీపీ రమేష్ వెల్లడించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం. జానకీనగర్కు చెందిన బాధిత కుటుంబ సభ్యులు గత శనివారం సాయంత్రం దమ్మాయిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి ఆభరణాలను అపహరించారు. ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితులు 100/112కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే అల్వాల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించారు.
ఈ చోరీకి దార్ల నెహెమయ్య అలియాస్ బ్రూస్లీ, నితిన్ ఫ్రాన్సిస్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బేగంపేటలోని బాలమ్ రాయ్ ఎక్స్ రోడ్డు వద్ద నితిన్ ఫ్రాన్సిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన 29.2 తులాల బంగారు ఆభరణాలు, 27 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రమేష్ తెలిపారు.
కాగా, ప్రధాన నిందితుడు దార్ల నెహెమయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏసీపీ వెల్లడించారు.
చోరీ జరిగిన వెంటనే స్పందించి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించడంతో పాటు చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా వ్యవహరించిన అల్వాల్ పోలీసులను ఏసీపీ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.
Medchall -Malkajgiri district
జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని